Telangana: కేంద్రానికి తెలంగాణ లేఖ.. రా రైస్ కొనాలని విజ్ఞప్తి
- కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్
- బాయిల్డ్ రైస్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడి
- బియ్యం ప్యాకింగ్ కోసం 15 కోట్ల బస్తాలు కావాలని విజ్ఞప్తి
ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. యాసంగిలో పండే మొత్తం ధాన్యాన్ని తామే కొంటామంటూ తెలంగాణ సర్కారు ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ నుంచి రా రైస్ ఎంత వచ్చినా తీసుకోండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి శనివారం తెలంగాణ సర్కారు ఓ లేఖ రాసింది.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ రాసిన ఈ లేఖలో తమ నుంచి రా రైస్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంతేకాకుండా ఒకవేళ బాయిల్డ్ రైస్ కావాలన్నా కూడా ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆ లేఖలో తెలంగాణ తెలిపింది. ఇక బియ్యం ప్యాకింగ్ కోసం 15 కోట్ల బస్తాలు కావాల్సి ఉందని.. ఆ మేరకు బస్తాల సరఫరాకు సహకరించాలని ఆ లేఖలో కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.