- రైతు సంఘర్షణ సభ పేరుతో నిర్వహణ
- బియ్యం కొనుగోళ్లలో పాలక పక్షాల వైఖరిని ఎండగట్టే వ్యూహం
- 7వ తేదీన హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ వచ్చే నెల (మే) 6న వరంగల్ లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ‘రైతు సంఘర్షణ సభ’ పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించనుంది.
ఇక మరుసటి రోజు మే 7న రాహుల్ గాంధీ హైదరాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2023 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలు గతంతో పోలిస్తే మెరుగయ్యాయన్న నివేదికల నేపథ్యంలో రాహుల్ పర్యటనకు వస్తుండడం గమనార్హం.
బియ్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాలను ప్రజలకు తెలియచెప్పడమే రాహుల్ బహిరంగ సభ ఉద్దేశ్యమని పార్టీ వర్గాలు అంటున్నాయి. రైతులను ఆదుకోవడంలో పాలక పపక్షం తీరును ఎండగట్టడంతోపాటు, వారికి అండగా కాంగ్రెస్ ఉందని చెప్పడమే సభ లక్ష్యంగా పేర్కొన్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కానుంది. గ్రూపులుగా విడిపోయి కొట్లాడుతున్న పార్టీని ఐక్యంగా మార్చడం కూడా రాహుల్ పర్యటన లక్ష్యాల్లో ఒకటిగా తెలుస్తోంది.