Ruturaj Gaikwad: రండి.. చెన్నై జట్టుకు జోష్ నివ్వండి.. అభిమానులకు రుతురాజ్ గైక్వాడ్ పిలుపు
- స్డేడియానికి వచ్చి ఉత్సాహానివ్వండి
- 2018లో నేనూ ఇదే పనిచేశా
- మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో
- జట్టుకు మద్దతుగా నిలవాలని పిలుపు
చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒకే విజయంతో సీఎస్కే ఐపీఎల్ టేబుల్ లో దిగువన ఉంది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే సీఎస్కే దాదాపు అన్నింటిలోనూ విజయాన్ని సాధించాలి. లేదంటే బలంగా ఉన్న ఇతర జట్లను కాదని ప్లే ఆఫ్స్ కు వెళ్లడం అసాధ్యమే.
ఈ క్రమంలో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అభిమానులకు ఒక ముఖ్యమైన సూచన చేశాడు. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నేటి రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మద్దతుదారులు ముందుకు వచ్చి తమ అభిమాన జట్టుకు ప్రోత్సాహం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోను సీఎస్కే విడుదల చేసింది. అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చి, రవీంద్ర జడేజా సారథ్యంలోని జట్టును ఉత్సాహపరచాలని కోరాడు.
‘‘2018లో చెన్నై జట్టు పుణెలో మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడు, స్టేడియానికి వచ్చి వారిని ఉత్సాహపరిచిన అభిమానుల్లో నేనూ ఉన్నాను. ఈ ఏడాది మీకు ఆ అవకాశం వచ్చింది. మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే అవకాశం ఉన్నప్పుడు వచ్చి మద్దతుగా నిలవండి’’అంటూ రుతురాజ్ గైక్వాడ్ కోరాడు. రుతురాజ్ పుణె పట్టణానికి చెందిన వాడు కావడం గమనార్హం. ఐపీఎల్ కెరీర్ ను 2019 సీజన్ నుంచి సీఎస్కేతోనే ఆరంభించి కొనసాగుతున్నాడు.