Vedant: అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన నటుడు మాధవన్ కుమారుడు
- డెన్మార్క్ ఓపెన్ లో వేదాంత్ కు రజతం
- కోపెన్ హాగెన్ లో మెరుగైన ప్రతిభ చూపిన మాధవన్ తనయుడు
- పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మాధవన్
ప్రముఖ నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మాధవన్ కుమారుడు వేదాంత్ అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మర్ గా రాణిస్తుండడమే అందుకు కారణం. వేదాంత్ తాజాగా డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్ లో నిర్వహించి డానిష్ స్విమ్మింగ్ ఓపెన్ చాంపియన్ షిప్ లో రజతం సాధించాడు.
వేదాంత్ చిన్నవయసు నుంచే స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్నాడు. పలు ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని పతకాలు కైవసం చేసుకున్నాడు. ఇటీవల జాతీయస్థాయి స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో వేదాంత్ 7 పతకాలు సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం. వాటిలో 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి.
కరోనా వ్యాప్తి కారణంగా ముంబయిలో స్విమ్మింగ్ పూల్స్ మూసివేయడంతో మాధవన్ తన కుమారుడ్ని దుబాయ్ తీసుకెళ్లారు. గత కొంతకాలంగా అక్కడి ఒలింపిక్ స్థాయి స్విమ్మింగ్ పూల్స్ లో సాధన చేయిస్తున్నారు. ఒలింపిక్స్ లో భారత్ కు స్విమ్మింగ్ క్రీడాంశంలో స్వర్ణం తీసుకురావడమే లక్ష్యంగా వేదాంత్ సాధన కొనసాగుతోంది.
తాజాగా, తన కుమారుడు డెన్మార్క్ లో రజతం గెలవడంపట్ల నటుడు మాధవన్ సోషల్ మీడియాలో స్పందించారు. భారత స్విమ్మింగ్ కోచ్ కు, భారత స్విమ్మింగ్ సమాఖ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.