CPI Ramakrishna: ఫోన్లు దొంగతనం చేయడానికి కోర్టుకు వచ్చారా?: నెల్లూరు ఎస్పీ వివరణపై సీపీఐ రామకృష్ణ విమర్శలు
- నెల్లూరు కోర్టులో చోరీ
- కాకాణి కేసు పత్రాలు మాయం!
- మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ విజయరావు
- ఎస్పీ వివరణ హాస్యాస్పదంగా ఉందన్న సీపీఐ రామకృష్ణ
నెల్లూరు కోర్టులో చోరీ జరగడం తెలిసిందే. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన పత్రాలు మాయమైనట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. కోర్టులో చోరీ పాత సామాన్ల దొంగల పనే అని వెల్లడించారు. దీనిపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శనాస్త్రాలు సంధించారు.
14 కేసుల్లో ఉన్న దొంగ ఫోన్లు దొంగతనం చేయడం కోసం కోర్టుకు వెళ్లాడా? అంటూ ప్రశ్నించారు. ఫోన్ల కోసమే కోర్టులో చోరీ జరిగిందని ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ఫోన్ల కోసం వచ్చిన దొంగకు కాకాణి కేసుకు సంబంధించిన పత్రాలతో ఏం పని? అని నిలదీశారు. అయినా ఫోన్లు మొబైల్ షాపులో ఉంటాయో, లేక కోర్టులో ఉంటాయో ఎస్పీయే చెప్పాలని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ఎస్పీ వ్యాఖ్యలు ఈ కేసును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఎస్పీ విజయరావు మీడియాతో మాట్లాడుతూ, కోర్టు ఆవరణలో ఇనుము దొంగతనానికి వచ్చిన పాత నేరస్తులు కుక్కలు అరవడంతో భయపడి కోర్టు రూమ్ తాళం పగులగొట్టి, లోపలికి ప్రవేశించారని వెల్లడించారు. ఆపై కోర్టు రూమ్ లోని బీరువాలో ఉన్న ఓ బ్యాగ్ తీసుకెళ్లారని వివరించారు. అయితే ఎస్పీ వివరణపై విమర్శలు వస్తున్నాయి.