Anil Kumar Yadav: ఇన్నాళ్లు మంత్రిని కాబట్టి సైలెంట్ గా ఉన్నా: అనిల్ కుమార్ యాదవ్
- నెల్లూరులో అనిల్ భారీ సభ
- భావోద్వేగాలతో అనిల్ ప్రసంగం
- జగనన్న సైనికుడిని అంటూ వ్యాఖ్యలు
- తనకు తానే పోటీ అని వెల్లడి
- ఎవరైనా జగన్ బొమ్మతోనే గెలుస్తారని స్పష్టీకరణ
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో ఇవాళ భారీ సభ ఏర్పాటు చేశారు. కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు వస్తున్న సమయంలోనే, అనిల్ సభ నిర్వహించడం చర్చనీయాంశంగా మారినా, ఆయన ఎక్కడా కాకాణి పేరు పలకకుండా, విపక్షాలపై విమర్శలు, సీఎం జగన్ పై విధేయత ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, సీఎం జగన్, నెల్లూరు ప్రజలకు సదా రుణపడి ఉంటానని అన్నారు. మంత్రిగా ఉండడం కంటే జగన్ అన్న సైనికుడిగా ఉండడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఒకసారి మంత్రినయ్యానని, అంతకుమించి ఇంకేం కావాలన్నారు. ఇప్పుడు తనకు మంత్రి పదవి లేదని, ఇకపై ఇంటింటికీ తిరుగుతానని చెప్పారు. తన రక్తంలో జగన్ నామస్మరణ తప్ప మరొకటి ఉండదన్నారు.
ఇన్నాళ్లు మంత్రిని కాబట్టి సైలెంట్ గా ఉన్నానని, ఇకపై త్రిబుల్ అటాకింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఎవరికీ బలనిరూపణ చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఎవరికో పోటీగా ఈ సభ నిర్వహించడంలేదని అన్నారు. తనకు తానే పోటీ అని ఉద్ఘాటించారు. ఇది ఆత్మీయ సభ మాత్రమేనని వెల్లడించారు. కాగా, తాను మళ్లీ మంత్రిని అవుతానంటూ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఇవాళ తనను మంత్రివర్గం నుంచి తీసేశారని అనుకోవడంలేదని అనిల్ కుమార్ అభిప్రాయపడ్డారు. తమను జగన్ నమ్మారని, అందుకే ముందుగా తమనే మంత్రులుగా చేశాడని వెల్లడించారు. జగన్ మళ్లీ సీఎం అవడం ఖాయమని, తాను ఆయన ఆశీస్సులతో మళ్లీ మంత్రిని అవుతానని వివరించారు. నాకోసం 730 రోజులు కష్టపడండి... మళ్లీ క్యాబినెట్ కు వస్తారని సీఎం మాటిచ్చారని, తప్పకుండా ఆయన కోసం శ్రమిస్తామని వివరించారు. ఎవరైనా సీఎం జగన్ బొమ్మతోనే గెలుస్తారని పేర్కొన్నారు.