Gujarat Titans: గుజరాత్‌ను గెలిపించిన మిల్లర్.. రషీద్‌ఖాన్.. ఉత్కంఠ పోరులో ఓడిన చెన్నై
- చివరి ఓవర్ వరకు విజయం దోబూచులాట
- అజేయంగా 94 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన మిల్లర్
- 21 బంతుల్లో 40 పరుగులు చేసిన రషీద్ ఖాన్
- చివరి వరకు పోరాడినా చెన్నైకి తప్పని ఓటమి
- 10 పాయింట్లతో అగ్రస్థానంలో టైటాన్స్
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం చివరికి గుజరాత్‌నే వరించింది. డేవిడ్ మిల్లర్ వీరబాదుడుకు తోడు రషీద్‌ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో బంతి మిగిలి ఉండగానే గెలుపు గుజరాత్ సొంతమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, అంబటి రాయుడు 46, శివమ్ దూబే 19, రవీంద్ర జడేజా 22 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీసుకున్నాడు.
అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్‌కు కలిసిరాలేదు. ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. శుభమన్‌గిల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ కూడా దారుణంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అభినవ్ మనోహర్ (12), రాహుల్ తెవాటియా (6) కూడా ఆకట్టుకోలేకపోయారు. 87 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోవడంతో విజయం చెన్నై వైపు మొగ్గింది.
అయితే, అప్పటికే క్రీజులో పాతుకుపోయిన డేవిడ్ మిల్లర్ చెలరేగిపోయాడు. బౌలర్లను చీల్చి చెండాడాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 94 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. మరోవైపు, ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ ఆపద సమయంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది.
చివరి రెండు ఓవర్లలో గుజరాత్ విజయానికి 26 పరుగులు అవసరం. మామూలుగానైతే అదేం పెద్ద లెక్కకాదు. కానీ కీలక వికెట్లు కోల్పోవడంతో విజయం ఇరు జట్లవైపు మొగ్గింది. ఆ ఓవర్లో 13 పరుగులు వచ్చినప్పటికీ చివరి బంతికి అల్జారీ జోసెఫ్ (0) వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా తొలి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే, మూడో బంతిని స్టాండ్స్‌లోకి తరలించిన మిల్లర్ ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు.
చివరి మూడు బంతులకు 7 పరుగులు అవసరం కాగా, ఫుల్‌టాస్‌గా వచ్చిన నాలుగో బంతిని ఆడే ప్రయత్నంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌కు మిల్లర్ దొరికిపోయాడు. దీంతో గుజరాత్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అదృష్టం గుజరాత్ వైపే ఉంది. ఆ బంతిని థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించడంతో గుజరాత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాతి బంతిని ఫోర్ కొట్టిన మిల్లర్.. ఐదో బంతికి రెండు పరుగులు తీయడంతో విజయం గుజరాత్ సొంతమైంది.
చివరి వరకు పోరాడిన చెన్నైకి ఓటమి తప్పలేదు. అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన మిల్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 10 పాయింట్లతో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, చెన్నై కింది నుంచి రెండో స్థానంలో ఉంది. చెన్నై బౌలర్లలో బ్రావోకు 3, మహీష్ తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి.