Ilayaraja: ఇళయరాజాకు రాజ్యసభ పదవి.. నామినేట్ చేసేందుకు రంగం సిద్ధం?
- అంబేద్కర్ కలలను మోదీ సాకారం చేస్తున్నారంటూ ఇళయరాజా ప్రశంసలు
- సంగీత దర్శకుడు ఆరెస్సెస్ ఏజెంట్ అంటూ డీఎంకే విమర్శలు
- సుబ్రహ్మణ్య స్వామి పదవీ కాలం ముగియడంతో మ్యూజిక్ మ్యాస్ట్రోకు రాజ్యసభ సభ్యత్వం!
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీని అంబేద్కర్‌తో పోల్చి ఆయనపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా త్వరలోనే రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. సంగీత రంగం నుంచి ఆయనను నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. సుబ్రహ్మణ్యస్వామి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇళయరాజాను రాజ్యసభకు పంపాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ప్రకటించనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
అంబేద్కర్ & మోదీ-రీఫార్మ్స్ ఐడియాస్ పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ (Ambedkar & Modi – Reformer’s Ideas, Performer’s Implementation) పుస్తకానికి ముందుమాట రాసిన ఇళయరాజా.. అంబేద్కర్ ఆశయాలను మోదీ నెరవేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడులోని అధికార పార్టీ సభ్యులు ఇళయరాజాపై దుమ్మెత్తి పోశారు. ఆయనను ఆరెస్సెస్ ఏజెంట్‌గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను రాజ్యసభకు పంపేందుకు కేంద్రం సిద్ధమైందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చర్చనీయాంశమైంది.