Kakani Govardhan Reddy: నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో చేసింది: ఏపీ మంత్రి కాకాణి
- మంత్రి అనేది పదవి కాదు.. బాధ్యతన్న కాకాణి
- ఎంతో మంది ఆశీర్వాదాలతో ఈ స్థాయికి వచ్చానని వ్యాఖ్య
- ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తుంచుకుంటానన్న మంత్రి
మంత్రి అనేది పదవి కాదని, ఒక బాధ్యత అని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంత్రిగా రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో అందరికీ అందుబాటులో ఉంటూ, అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని చెప్పారు. రైతుల జీవితంలో వెలుగులు నింపడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
ఎంతో మంది ఆశీర్వాదాలతోనే మంత్రి స్థాయికి వచ్చానని... ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తుంచుకుంటానని కాకాణి అన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో సహకరించిందని చెప్పారు. మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు.
ధాన్యం కొనుగోళ్ల కోసం జగన్ రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయం చేసి, రైతులకు మేలు కలిగేలా చేస్తామని అన్నారు. రైతులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.