Russia: మేరియుపోల్ తర్వాత ఉక్రెయిన్ లో మరో నగరంపై కన్నేసిన రష్యా
- ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
- మేరియుపోల్ నగరం హస్తగతం
- ల్వీవ్ నగరంపై తీవ్రస్థాయిలో దాడులు
- ఈ ఉదయం 5 క్షిపణులు ప్రయోగించిన వైనం
ఉక్రెయిన్ లోని మేరియుపోల్ నగరాన్ని కబళించిన రష్యా బలగాలు, మరో నగరంపై దృష్టి సారించాయి. ఉక్రెయిన్ లోని ల్వీవ్ నగరాన్ని చేజిక్కించుకునే దిశగా రష్యా సేనలు తీవ్రస్థాయిలో దాడులకు తెరలేపాయి. పశ్చిమ ఉక్రెయిన్ లో ల్వీవ్ ఓ ముఖ్యనగరంగా విలసిల్లుతోంది. ఈ నగరానికి రష్యా సేనల ముప్పు తక్కువ అని ఇటీవల కీవ్, మేరియుపోల్ నగరాల నుంచి పౌరులను ఇక్కడికే తరలించారు. ఇప్పుడా నగరాన్నే రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి.
కొన్నివారాల కిందట ల్వీవ్ ను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దాంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన రష్యా సైన్యం... ఈసారి శక్తిమంతమైన ఆయుధాలతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో నేటి ఉదయం 5 భారీ క్షిపణులను ల్వీవ్ పై ప్రయోగించింది. నగరంలో భారీ పేలుళ్లు సంభవించినట్టు ల్వీవ్ నగర మేయర్ ఆండ్రీ సదోవీ తెలిపారు.
ఇటీవల తమ యుద్ధ నౌకను ఉక్రెయిన్ తుత్తునియలు చేశాక రష్యా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని క్షిపణి తయారీ, మరమ్మతుల కేంద్రాన్ని ధ్వంసం చేసిన రష్యా బలగాలు, గత రాత్రి కూడా ఓ ఆయుధ కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించాయి.
రాజధాని కీవ్ పై దాడులు పెంచుతామని చెప్పిన రష్యా అందుకు తగ్గట్టుగానే భారీ సంఖ్యలో ఆయుధ వ్యవస్థలను ఉక్రెయిన్ రాజధాని దిశగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మాత్రం లొంగిపోయేది లేదని, చివరి వరకు రష్యాకు ఎదురొడ్డి నిలుస్తామని స్పష్టం చేశారు.