El Pitt: 196 దేశాలకు మోస్ట్ వాంటెడ్..... గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహంతో దొరికిపోయాడు!
- మెక్సికోలో డ్రగ్స్ దందా నడిపిస్తున్న ఎల్ పిట్
- డ్రగ్స్ కింగ్ ఎల్ చాపోకు అనుచరుడే ఎల్ పిట్
- ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ వారెంట్లు
- కొలంబియాలో దొరికిపోయిన వైనం
మెక్సికోలో డ్రగ్ మాఫియాలు ఎక్కడికక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. డబ్బు, ఆయుధాలు, మందబలం పుష్కలంగా ఉండే డ్రగ్స్ ముఠాలు అధికారులను ఏమాత్రం లెక్కచేయవు. మెక్సికో నగరాలు, పట్టణాల్లో పోలీసులకు, మాదకద్రవ్యాల ముఠా సభ్యులకు వీధిపోరాటాలు నిత్యకృత్యం అని చెప్పాలి. అయితే ఆరేళ్ల కిందట మెక్సికో డ్రగ్ కింగ్ జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోయడంతో, తాత్కాలికంగా కొంత అలజడి తగ్గింది.
అయితే, ఎల్ చాపో ముఖ్య అనుచరుడు, ఎల్ పిట్ గా పేరుపొందిన బ్రియాన్ డొనాసియానో ఒలుగ్విన్ వెర్డుగో మాత్రం చాన్నాళ్లుగా మెక్సికన్ పోలీసులకు సవాలుగా మారాడు. ఎల్ చాపో లేని నేపథ్యంలో, ముఠాను సమర్థంగా నడిపించడమే కాదు, ఇతర దేశాలకు సైతం కార్యకలాపాలను మరింత విస్తరించి బాస్ ను మించిపోయాడు. 39 ఏళ్ల ఎల్ పిట్ ను దాదాపు 196 దేశాలు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చాయి. అతడిపై ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ వారెంట్లు జారీ అయ్యాయి.
ఏళ్ల తరబడి చిక్కడు దొరకడు తరహాలో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఈ కరుడుగట్టిన డ్రగ్ ట్రాఫికర్ ఎట్టకేలకు ఇటీవల పట్టుబడ్డాడు. అందుకు కారణం అతగాడి గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహమే. కొన్నిరోజుల కిందట ఫేస్ బుక్ లో అమెరికా డ్రగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అధికారులకు ఓ ఫొటో కంటబడింది. ఓ పర్యాటక ప్రాంతంలో ఓ జంట ముద్దు పెట్టుకుంటున్న ఫొటో అది. ఆ ఫొటోలో ఉన్నది ఎల్ పిట్ అని గుర్తించిన అమెరికా అధికారులు అతడు కొలంబియాలో ఉన్నట్టు పసిగట్టారు.
వెంటనే కొలంబియా అధికారులకు సమాచారం అందించారు. దాంతో పక్కా ప్లాన్ వేసిన కొలంబియా పోలీసులు కాలీ నగరంలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఎల్ పిట్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అతడు కొలంబియాలోనే మకాం వేసినట్టు విచారణలో వెల్లడైంది. మెక్సికో, అమెరికా దేశాలకు వేల కోట్ల విలువైన కొకైన్ ను తరలించేందుకు కొలంబియాలోని (రివల్యూషనరీ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) 'ఫార్క్' గెరిల్లా దళాల సాయం కోరేందుకు అతడు కొలంబియాలో పర్యటిస్తున్నట్టు తెలుసుకున్నారు.
కాగా, ఎల్ పిట్ గాళ్ ఫ్రెండ్ మెక్సికోలో మోడల్ గా పేరుగాంచింది. ఎల్ పిట్ 'ఫార్క్' సభ్యులను కలిశాక, అతడిని ఆమె ప్రఖ్యాత టూరిస్టు కేంద్రం లాస్ క్రిస్టాలెస్ కు తీసుకువచ్చింది. అక్కడ పర్వతంపై ఉన్న ఎత్తయిన జీసస్ విగ్రహం ముందు కిస్ చేసుకుంటూ ఇద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పుడా ఫొటోనే ఎల్ పిట్ కొంపముంచింది.
అతడు తన గాళ్ ఫ్రెండ్ తో ఉన్న అపార్ట్ మెంట్ వద్ద కొలంబియా పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అతడు అక్కడే ఉన్నాడని నిర్ధారించుకుని దాడులు చేశారు. అయితే దాడుల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఎల్ పిట్ కొలంబియా పోలీసులకు రూ.2 కోట్ల మేర లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, ఇదే ఘటన మెక్సికోలో జరిగుంటే తన సాయుధ దళాలు కొద్దిసేపట్లోనే తనను విడిపించి ఉండేవని పోలీసులతో చెప్పాడు. అతడిని పలు కేసుల విచారణ నిమిత్తం అమెరికాలోని కాలిఫోర్నియాకు తరలించనున్నారు.