Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- రాష్ట్రపతి పాలనలోనే ఎన్నికలన్న ఉత్తమ్
- ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమస్య లేదని వ్యాఖ్య
- ముందస్తుకు వెళ్లినా ఇదే డిమాండ్ చేస్తామన్న ఎంపీ
తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది (2023)చివరలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం గతంలో మాదిరే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిపినా...రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాతే జరపాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోమవారం నాడు గాంధీ భవన్లో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు, ఆ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదంపై కీలక చర్చ జరిగింది.
ఈ చర్చలో పాలుపంచుకున్న సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ కీలక ప్రతిపాదన చేశారు. "తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రపతి పాలనలోనే జరగాలి. ముందస్తు ఎన్నికలకు పోయినా మేం ఇదే డిమాండ్ చేస్తాం" అని ఆయన అన్నారు.