Yash: సినిమాల్లో ట్రై చేస్తానంటే మా నాన్న నా జేబులో 300 రూపాయలు పెట్టాడు: హీరో యష్
- తన తండ్రి బస్ డ్రైవర్ అని చెప్పిన యష్
- తమది మధ్యతరగతి కుటుంబమని వెల్లడి
- తాను సినిమాల్లోకి రావడం పేరెంట్స్ కి ఇష్టం లేదని వ్యాఖ్య
- ఇదంతా మీ అభిమానమేనన్న యష్
'కేజీఎఫ్ 2'తో సంచలన విజయాన్ని సాధించిన యష్, ఇప్పుడు ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలు కొత్త రికార్డులను సృష్టిస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని చెబుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నటుడిగా తన జర్నీ ఎలా మొదలైందనే విషయాన్ని గురించి ప్రస్తావించాడు.
"మాది చాలా మధ్యతరగతి ఫ్యామిలీ .. మా ఫాదర్ బస్ డ్రైవర్ గా పనిచేసేవారు. నేను సినిమాల్లోకి రావడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. సినిమాలు అందరికీ కలిసిరావనేది ఆయన నమ్మకం. అయితే ఆయన నా ఇష్టాన్ని కాదనలేదు. కొంతకాలం ట్రై చేసి .. మనకి సెట్ కావు అనుకుంటే వెనక్కి వచ్చేయమని చెప్పారు.
అలా ఆయన నా దారిలో నన్ను వెళ్లనిస్తూ ఖర్చుల కోసం 300 రూపాయలు నా జేబులో పెట్టారు. ఆ డబ్బులు అయిపోయిన తరువాత నేను సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టాను. అక్కడ సంపాదించుకున్న పేరే నన్ను సిల్వర్ స్క్రీన్ కి తీసుకొచ్చింది. అక్కడి నుంచి ఇక్కడి వరకూ రాగలిగాను. ఈ సక్సెస్ నా అభిమానులదీ .. నాకు అవకాశం ఇచ్చిన వారందరిదీ" అని చెప్పుకొచ్చాడు.