Gotabaya Rajapaksa: తప్పటడుగులే ఈ దుస్థితికి దారితీశాయి: శ్రీలంక అధ్యక్షుడు
- కరోనా విపత్తు ప్రభావం చూపిందన్న అధ్యక్షుడు
- అప్పులు కూడా బెడిసి కొట్టాయని వ్యాఖ్య
- వీటిని చక్కదిద్దాల్సి ఉందన్న రాజపక్స
- ప్రజల ఆగ్రహం, అసహనం అర్థం చేసుకోతగినవంటూ కామెంట్
తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి తప్పటడుగులే కారణమని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు. 17 మంది నూతన కేబినెట్ మంత్రులను నియమించిన సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు.
‘‘గడిచిన రెండున్నరేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి, అప్పుల భారం, మా వైపు నుంచి కొన్ని తప్పులు ఈ దుస్థితికి కారణం. వీటిని చక్కదిద్ది ముందుకు వెళ్లాల్సి ఉంది. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాల్సి ఉంది.
ఆర్థిక సంక్షోభం ఫలితంగా ప్రజలు నేడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నిత్యావసరాల కోసం పొడవాటి లైన్లలో వేచి ఉండాల్సి రావడం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం, అసహనం అర్థం చేసుకోతగినవి’’ అని రాజపక్స నూతన మంత్రులతో అన్నారు.
శ్రీలంక 25 బిలియన్ డాలర్ల విదేశీ రుణ భారాన్ని మోస్తోంది. ఇందులో 7 బిలియన్ డాలర్లను ఈ ఏడాది తీర్చాల్సి ఉంది. తీర్చలేమని శ్రీలంక సర్కారు ఇప్పటికే ఓ ప్రకటన చేయడం గమనార్హం. దీంతో దిగుమతులు చేసుకోలేని పరిస్థితుల్లో ఆ దేశం ఉంది. ఆదాయం తీసుకురాని మౌలిక రంగ ప్రాజెక్టులకు భారీగా రుణాలు తీసుకోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.