Telangana: మంత్రులు, అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
- ప్రగతిభవన్ లో కొనసాగుతున్న సమావేశం
- యాసంగి ధాన్యం సేకరణపై ప్రధాన చర్చ
- జిల్లాల్లో ఏర్పాట్లపై ఆరా తీస్తున్న సీఎం
- దళితబంధు తీరుతెన్నులపైనా చర్చ
యాసంగి ధాన్యం సేకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్ లో నిర్వహిస్తున్న కీలక సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, సీఎస్ సోమేశ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. యాసంగి ధాన్యం సేకరణ, ఏర్పాట్ల తీరుపై ఆయన సమీక్ష చేస్తున్నారు.
ముడి బియ్యాన్నే ఇస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 40 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకునేందుకు కేంద్రం నిన్న రాష్ట్రానికి కబురు పంపింది. ఈ నేపథ్యంలోనే జిల్లాల్లో ధాన్యం సేకరణపై తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపైనా ఆయన చర్చించనున్నారని తెలుస్తోంది. దాంతో పాటు దళితబంధు పథకం అమలు తీరుతెన్నులపైనా అధికారులతో సీఎం చర్చలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు.