Mandakini: మళ్లీ కెమెరా ముందుకు వస్తున్న నాటి నీలికళ్ల సుందరి మందాకిని!
- గతంలో పలు హిట్ చిత్రాల్లో నటించిన మందాకిని
- రామ్ తేరీ గంగా మైలీ చిత్రంతో నేషనల్ పాప్యులారిటీ
- తెలుగులో సింహాసనం చిత్రంతో గుర్తింపు
- 1996 నుంచి నటించని వైనం
- తాజాగా కుమారుడి కోసం మ్యూజిక్ వీడియో
భారతీయ చిత్ర పరిశ్రమను 80, 90వ దశకాల్లో తమ అందచందాలతో ఉర్రూతలూగించిన బాలీవుడ్ కథానాయికల్లో మందాకిని ఒకరు. మిగతా తారలకు భిన్నంగా నీలికళ్లతో ప్రత్యేకంగా కనిపించే మందాకిని హిందీలోనే కాదు, తెలుగులోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సింహాసనం, భార్గవరాముడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలీవుడ్ లో ఆమె నటించిన రామ్ తేరీ గంగా మైలీ చిత్రం నేషనల్ హిట్ గా గుర్తింపు పొందింది. మందాకిని చివరిసారిగా 1996లో జోర్దార్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత మళ్లీ నటించలేదు.
అయితే, తాజాగా కెమెరా ముందుకు రావాలని 58 ఏళ్ల మందాకిని నిర్ణయించుకున్నారు. ఈసారి సినిమాల్లో మాత్రం కాదు... ఓ మ్యూజిక్ వీడియోతో అభిమానులను అలరించేందుకు మందాకిని సిద్ధమయ్యారు. ఈ మ్యూజిక్ వీడియో ద్వారా మందాకిని తన కుమారుడు రబ్బిల్ ఠాకూర్ ను పరిచయం చేయనున్నారు. ఈ వీడియో ప్రాజెక్టుకు సాజన్ అగర్వాల్ దర్శకుడు.
'మా ఓ మా' అనే ఈ పాట గురించి మందాకిని మాట్లాడుతూ, ఇందులో తన కుమారుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని, ఈ నెలాఖరు కల్లా పాట చిత్రీకరణ పూర్తవుతుందని వెల్లడించారు.
కాగా, మందాకిని కెరీర్ లో ఓ అంశం వివాదాస్పదమైంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆమె అఫైర్ నడిపినట్టు అప్పట్లో మీడియా కోడై కూసింది. దావూద్, మందాకిని దుబాయ్ లో కలిసున్న ఫొటోలు కూడా తెరపైకి రావడంతో ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ఆరోపణలను మందాకిని ఖండించారు. దావూద్ ఇబ్రహీంతో తనకు ఎలాంటి ప్రేమాయణం లేదని స్పష్టం చేశారు.
మందాకిని 1990లో డాక్టర్ కగ్యూర్ రింపోచే ఠాకూర్ ను పెళ్లాడారు. వీరికి రబ్బిల్ ఠాకూర్ అనే కుమారుడు, రబ్బే ఇన్నాయా అనే కుమార్తె ఉన్నారు. సినీ రంగం నుంచి వైదొలిగాక మందాకిని టిబెటన్ యోగా క్లాసులు నిర్వహిస్తుండగా, ఆమె భర్త టిబెటన్ హెర్బల్ సెంటర్ ఏర్పాటు చేశారు.