New Delhi: ఢిల్లీలోని జహంగీర్ పురిలో భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

NDMC Demolishes Illegal Constructions In Violence Hit Jahangirpuri

  • అక్రమ నిర్మాణాలను కూల్చిన అధికారులు
  • హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఘర్షణలు
  • బీజేపీ నేత లేఖతో కూల్చివేతలకు ఆదేశం
  • సుప్రీంకోర్టు జోక్యం.. కూల్చివేతల నిలిపివేత
  • వ్యవహారంపై రేపు విచారణ.. ఢిల్లీ హైకోర్టులో ఇవాళే

రెండు వర్గాల మధ్య అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీలోని జహంగీర్ పురిలో అధికారులు పటిష్ఠ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఓ వర్గం వారు రాళ్లు రువ్వడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. 

అయితే, జహంగీర్ పురిలో అల్లర్లకు కారణమైన వారి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలంటూ బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ఎన్డీఎంసీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ కు లేఖ రాశారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకునే అల్లర్లకు పాల్పడిన వాళ్లు రెచ్చిపోయారని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) మేయర్ ఆదేశాల మేరకు 400 మంది పోలీసు బలగాల బందోబస్తు నీడలో అధికారులు అక్కడకు చేరుకున్నారు. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం ప్రారంభించారు. 

అల్లర్ల కోసం వాడిన గాజు సీసాలను దాచిన స్క్రాప్ గోదాములను మొత్తం కూల్చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రోడ్డు పక్కన ట్రాఫిక్ కు ఆటంకం కలిగించేలా ఉన్న కట్టడాలు, షాపులనూ కూల్చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

సుప్రీంకోర్టు జోక్యంతో ఆగిన కూల్చివేతలు

అయితే, ఎలాంటి నోటీసులు లేకుండా ఉన్నపళంగా కూల్చివేతలంటే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కూల్చివేతలను ఆపివేయాలంటూ ఎన్డీఎంసీకి ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారంపై రేపు మరోసారి విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కూల్చివేతల వ్యవహారంపై విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. 

కాగా, జహంగీర్ పురి అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా ఇద్దరు మైనర్లు సహా 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News