New Delhi: పేద ముస్లింలపై బీజేపీ యుద్ధం చేస్తోంది: జహంగీర్ పురి కూల్చివేతలపై అసదుద్దీన్ ఒవైసీ
- పేద ముస్లింల బతుకుపై కొడుతోందన్న అసదుద్దీన్
- ఆక్రమణల పేరిట పేదల ఇళ్లు కూలుస్తోందని ఆరోపణ
- కేజ్రీవాల్ ది రెండు నాల్కల ధోరణి అన్న అసద్
- పరిస్థితులు దయనీయమన్న ఎంఐఎం చీఫ్
ఢిల్లీ జహంగీర్ పురి కూల్చివేతలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. బీజేపీ, ఆప్ ల తీరును తప్పుబట్టారు. పేద ముస్లింలపై బీజేపీ యుద్ధం ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ముస్లింల బతుకుపై కొడుతోందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాగానే ఢిల్లీ పురపాలికను నియంత్రిస్తున్న బీజేపీ.. పేదల ఇళ్లను కూల్చివేస్తోందని విమర్శించారు. ఆక్రమణల పేరుతో ఇళ్ల కూల్చివేతలకు దిగుతోందన్నారు.
నోటీసుల్లేకుండా, కోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా పేద ముస్లింలపై విరుచుకుపడుతోందన్నారు. ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. కేజ్రీ సర్కార్ కూడా కూల్చివేతల్లో భాగమైందా? అని ప్రశ్నించారు. ప్రజా పనుల విభాగం కూడా కూల్చివేతలకు సహకరిస్తోందా? అని నిలదీశారు. ఇలాంటి పిరికిపంద చర్యలు, ఇలాంటి మోసకారి తనానికేనా జహంగీర్ పురి ప్రజలు ఓటేసిందని అన్నారు.
‘‘పోలీసులు మా నియంత్రణలో లేరు’’ అని ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకోలేరని మండిపడ్డారు. ఢిల్లీ సర్కారులోని పలు శాఖలు కూడా కూల్చివేతల్లో భాగం అయ్యయాని గుర్తు చేశారు. పరిస్థితులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం న్యాయ సాయం తీసుకునేందుకూ అవకాశం ఇవ్వడం లేదన్నారు.