Marcus Stoinis: అంపైర్ నిర్ణయంతో సహనం కోల్పోయిన మార్కస్ స్టోయినిస్
- హేజిల్ వుడ్ వైడ్ బాల్
- స్టంప్స్ ను దాటుకుని వచ్చి కొట్టిన స్టోయినిస్
- అది వెళ్లి స్టంప్స్ ను పడగొట్టడంతో అవుట్
- ఆఫ్ స్టంప్స్ కావడంతో వైడ్ ఇవ్వని అంపైర్
అంపైర్ తీసుకున్న నిర్ణయం లక్నో జట్టు ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కు కోపం తెప్పించింది. దీంతో అరుపులతో పాటు, నిలదీయడం అతడి వంతు అయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. స్టోయినిస్ కు అంతగా కోపం రావడానికి ఏం జరిగిందా? అని చూస్తే..
లక్నో జట్టు గెలవడానికి 12 బంతుల్లో 34 పరుగులు అవసరం. స్టోయినిస్ కు తోడుగా జేసన్ హోల్డర్ క్రీజులో ఉన్నారు. స్టోయినిస్ బ్యాటింగ్ నైపుణ్యం తెలిసిన వారు లక్నో విజయాలపై ఇంకా ఆశలు కోల్పోలేదు. అప్పటికే మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసిన హేజిల్ వుడ్ మరోసారి బౌలింగ్ కు దిగాడు.
హేజిల్ వుడ్ వైడ్ బంతి సంధించాడు. దీంతో స్టోయినిస్ స్టంప్స్ ను దాటుకుని ముందుకు వచ్చి మరీ బంతిని చితకబాదుదామని ప్రయత్నించాడు. అది బ్యాట్ నుంచి వెళ్లి స్టంప్స్ ను తాకింది. నిజానికి అయితే అది వైడ్ బంతే. అందులో సందేహమే లేదు. కానీ, స్టోయినిస్ స్టంప్స్ ను దాటుకుని ముందుకు రావడం (ఆఫ్ స్టంప్స్) ఫీల్డ్ అంపైర్ కు నచ్చలేదు. దాంతో బాల్ ను వైడ్ గా ఇవ్వలేదు. బ్యాటర్ల కదలికలకు అనుగుణంగా వైడ్ పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అంపైర్లకు ఉంది. ఈ విషయంలోనే స్టోయినిస్ కు చిర్రెత్తుకొచ్చింది. స్టోయినిస్ తీరుపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.