Delhi Capitals: పంజాబ్‌పై ఢిల్లీ అలవోక విజయం.. చెత్తగా ఓడిన మయాంక్ సేన
- 116 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి సగం ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ
- పొదుపుగా బౌలింగ్ చేసిన కుల్దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
- 8వ స్థానానికి పడిపోయిన పంజాబ్
పంజాబ్ కింగ్స్‌తో ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 115 పరుగుల విజయ లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్ పృథ్వీషా 20 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 60 పరుగులు చేసి తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. షా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (12) అండగా వార్నర్ మిగతా పని పూర్తి చేశాడు. ఢిల్లీ కేపిటల్స్‌కు ఇది మూడో విజయం కాగా, పంజాబ్‌కు నాలుగో పరాజయం. పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఆరో స్థానంలోను, పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో ఉన్నాయి.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయిన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. పంజాబ్ జట్టులో జితేశ్ శర్మ చేసిన 32 పరుగులే అత్యధికం. మయాంక్ అగర్వాల్ 24, షారూఖ్ ఖాన్ 12, రాహుల్ చాహర్ 12 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్ కూడా దాటలేదు.
ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. పొదుపుగా బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.