Supreme Court: అబూ సలేం కేసు విచారణ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- శిక్ష తగ్గించాలంటూ అబూ సలేం పిటిషన్
- పిటిషన్ విచారణకు ఇది సరైన సమయం కాదన్న కేంద్ర హోం శాఖ
- సమయాన్ని మీరెలా నిర్ణయిస్తారంటూ కోర్టు ఆగ్రహం
- ఉపన్యాసాలు వినే అవసరం కోర్టుకు లేదని అసహనం
- న్యాయ వ్యవస్థకు కేంద్రం ఆదేశాలు అక్కర్లేదని మండిపాటు
కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు బొంబాయి బాంబు పేలుళ్ల కేసులో శిక్ష తగ్గించాలంటూ అబూ సలేం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై గురువారం నాటి విచారణ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అబూ సలేం పిటిషన్ విచారణ సందర్భంగా కేంద హోం మంత్రిత్వ శాఖ తన వాదనలను వినిపించింది. ఈ క్రమంలో ఈ పిటిషన్ విచారణకు ఇది సరైన సమయం కాదంటూ హోం మంత్రిత్వ శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్య విన్నంతనే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు... సమయాన్ని మీరెలా నిర్ణయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపన్యాసాలు వినే అవసరం కోర్టుకు లేదని అసహనం వ్యక్తం చేసిన కోర్టు... న్యాయ వ్యవస్థకు కేంద్రం ఆదేశాలు అక్కర్లేదని మండిపడింది.