Imran Khan: సొంత ప్రయోజనాల కోసం భారత్.. పరుల ప్రయోజనాల కోసం పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఫైర్
- తన ప్రజల కోసమే భారత్ పనిచేస్తుందన్న ఇమ్రాన్
- ఎవరి ఒత్తిళ్లకూ లొంగదంటూ కితాబు
- ఇతరుల ప్రయోజనాల కోసం పాక్ పనిచేస్తోందని కామెంట్
- తన ప్రత్యర్థులు కూడా దీనిని ఇష్టపడరన్న మాజీ ప్రధాని
భారత్ విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి కీర్తించారు. భారత్ తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత లాహోర్ లో జరిగిన సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ఇతర దేశాలకు ప్రయోజనం చేకూర్చే ముందు తన సొంత ప్రయోజనాల గురించి భారత్ ఆలోచించుకుంటుందని ఇమ్రాన్ చెప్పారు.
‘‘భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. అయినా రష్యా నుంచి చమురు తీసుకుంటోంది. చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్ కు సూచించినప్పుడు.. ‘మా దేశానికి ఏది మంచో ఆ కోణంలోనే నిర్ణయం తీసుకుంటాం’అని సూటిగా స్పష్టం చేసింది. భారత విదేశాంగ విధానం అన్నది తన సొంత ప్రజల కోసం. కానీ, మన విదేశాంగ విధానం ఇతరులకు మేలు చేసేది. వారు కూడా (నా ప్రత్యర్థులు) కూడా దీనిని ఇష్టపడరు. చైనాతో మన స్నేహాన్ని కూడా వారు ఇష్టపడడం లేదు. అప్పుడే కుట్ర (తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా) మొదలైంది’’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.