Anand Mahindra: ఆనంద్ మహీంద్రా మెచ్చిన కొత్త టూరిస్ట్ స్పాట్!
- లక్షద్వీప్ లోని మినీకాయ్ గురించి మహీంద్రా ట్వీట్
- సెలవుల్లో అక్కడ గడుపుదామన్న ఆలోచన
- ఎవరైనా వెళితో ఫొటోలు షేర్ చేయాలని పిలుపు
పర్యాటక ప్రియులు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ట్విట్టర్ లో ఫాలో అయితే చాలు.. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను తెలుసుకోవచ్చు. చక్కని ప్రయాణ గమ్యస్థానాలను అన్వేషించి మరీ వాటిని తన ఫాలోవర్లతో పంచుకోవడం ఆనంద్ మహీంద్రా అలవాట్లలో ఒకటి. తాజాగా ‘మినీకాయ్’ అనే ఒక ప్రదేశాన్ని ఆనంద్ మహీంద్రా పరిచయం చేశారు.
పగడపు ద్వీపం మాదిరి కనిపించే సుందర తీర ప్రదేశమే ఇది. లక్షద్వీప్ పరిధిలో 4.8 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ సుందర ప్రాంతం లక్షద్వీప్ కు దూరంగా ఉండగా.. మాల్దీవులకు దగ్గరగా ఉంది. భారత్ లోని ఎన్నో ప్రాంతాల కంటే కూడా మినీకాయ్ మనకు దగ్గరగానే ఉంది.
‘‘ఇది చాలా వింతగా ఉంది. సెలవులను ఇక్కడ గడుపుదామని నాకు ఎందుకు ఆలోచన రాలేదు? అక్కడ ఎవరైనా ఉన్నారా..? ఉంటే మీ పర్యటన ఫొటోలను షేర్ చేయండి’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 1885లో కట్టిన లైట్ హౌస్ కూడా ఇక్కడి మరో ఆకర్షణ.