Jammu And Kashmir: తమ చట్టసభ ప్రతినిధి పీవోకేలో పర్యటించడంపై అమెరికా వివరణ
- ఆమెది అనధికార, వ్యక్తిగత పర్యటన అని వెల్లడి
- విదేశాంగ శాఖతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
- పాక్ పై అమెరికా విధానాలు మారవన్న విదేశాంగ శాఖ
అమెరికా చట్టసభ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పర్యటించడం.. ఇటీవల పదవీచ్యుతుడైన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో భేటీ అవడంపట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అమెరికా స్పందించింది.
ఆమెది అనధికారిక పర్యటన అని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి ఇల్హాన్ నాలుగు రోజుల పర్యటనకు గానూ ఈ నెల 20న పాకిస్థాన్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే అదే రోజు పీవోకేలో పర్యటించారు. అంతేకాదు.. పీవోకేపై అమెరికా శ్రద్ధ అవసరమన్నారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సంకుచిత బుద్ధితో కూడిన పర్యటన అని వ్యాఖ్యానించింది.
దీంతో ఆమెది అనధికార వ్యక్తిగత పర్యటన అని, పాక్ పై అమెరికా ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ మంత్రి సలహాదారు అయిన డెరెక్ చొల్లెట్ తెలిపారు. ఆమె పర్యటనకు విదేశాంగ శాఖతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె వ్యక్తిగతంగా పాక్ పర్యటనకు వెళ్లారని తేల్చి చెప్పారు.