CM Jagan: బటన్ నొక్కి డ్వాక్రా మహిళల ఖాతాలకు రూ.1,261 కోట్లు జమచేసిన సీఎం జగన్

CM Jagan releases funds to self help groups women

  • ఒంగోలులో సీఎం జగన్ సభ
  • డ్వాక్రా మహిళలకు వైఎస్సాస్ సున్నా వడ్డీ నిధుల విడుదల
  • గత ప్రభుత్వం మోసం చేసిందన్న సీఎం జగన్
  • అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి బయటపడేశామని వెల్లడి

ఏపీ సీఎం జగన్ ఇవాళ ఒంగోలు పర్యటనలో భాగంగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,261 కోట్లను ఒక్క బటన్ క్లిక్ తో డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, అర్హత గల 9.76 లక్షల సంఘాల్లోని 1,02,16,410 మహిళలకు లబ్ది చేకూరనుందని వెల్లడించారు. 

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు రూ.3,615 కోట్లు అందించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద 2020 ఏప్రిల్ లో రూ.1,258 కోట్లు, 2021 ఏప్రిల్ లో రూ.1,100 కోట్లు, తాజాగా రూ.1,261 కోట్లు జమ చేశామని వివరించారు.

గతంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు 12.5 నుంచి 13.5 శాతం వరకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ తాము బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను 8.5-9.5 శాతానికి తగ్గించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి, అక్షరాలా రూ.14,205 కోట్ల మేర చెల్లించకుండా మోసం చేసిందని ఆరోపించారు. దాంతో ఎ-గ్రేడ్, బి-గ్రేడ్ లుగా ఉన్న పొదుపు సంఘాలన్నీ దిగజారిపోయాయని.. సి-గ్రేడ్, డి-గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయని విచారం వ్యక్తం చేశారు. 

2014 నుంచి 2019 మధ్య పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని కూడా ఎత్తివేస్తూ గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయని, 2016 అక్టోబరు నుంచి సున్నా వడ్డీకి ఇవ్వాల్సిన సొమ్ముకు పూర్తిగా ఎగనామం పెట్టారని సీఎం జగన్ విమర్శించారు. గతంలో 18.36 శాతం ఎన్పీయేలుగా, అవుట్ స్టాండింగ్ జాబితాలో ఉన్న సంఘాలు నేడు కేవలం 0.73 శాతానికి పడిపోయాయని తెలిపారు. 

అయితే, పొదుపు సంఘాలకు 2019 ఎన్నికల నాటి వరకు ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో ఇవ్వడం ద్వారా అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి తప్పించామని వెల్లడించారు. మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే రెండు విడతల్లో ఆసరా పథకానికి రూ.12,758 కోట్లు ఇచ్చామని చెప్పారు. అటు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న 24.95 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ రూ.9,180 కోట్లు అందించడం జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News