The Phoenix Ghost: 'ది ఫినిక్స్ ఘోస్ట్'... ఉక్రెయిన్ కు రహస్య ఆయుధాన్ని అందించాలని అమెరికా నిర్ణయం
- ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- ఉక్రెయిన్ కు ఆయుధ వ్యవస్థలు అందిస్తున్న అమెరికా
- తాజాగా ఘోస్ట్ డ్రోన్లు అందించేందుకు సన్నాహాలు
- ఇప్పటివరకు ఎక్కడా వీటిని ఉపయోగించని అగ్రరాజ్యం
దాదాపు రెండు నెలలుగా రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే పలు కీలక ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేసిన బైడెన్ సర్కారు తాజాగా ఓ రహస్య ఆయుధాన్ని అందించింది. దీనిపేరు 'ది ఫినిక్స్ ఘోస్ట్'. ఇది లక్షణాల రీత్యా డ్రోన్ అయినప్పటికీ దీంట్లో ఉపయోగించే టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఆయుధాలు అన్నీ రహస్యమే.
అమెరికా రక్షణశాఖ ప్రతినిధి జాన్ కెర్బీ స్పందిస్తూ, తాము అందించేది గురితప్పని ఆయుధం అని చెప్పారు. ఇటీవల ఉక్రెయిన్ కు అందించి స్విచ్ బ్లేడ్ డ్రోన్ల తరహాలోనే ఇది కూడా సమర్థంగా పనిచేస్తుందని, పూర్తిగా అటాకింగ్ డ్రోన్ అని స్పష్టం చేశారు. దీంట్లో ఉండే కెమెరాలు యుద్ధరంగం సమాచారాన్ని సమగ్రంగా సేకరించగలవని తెలిపారు. దీని గురించి అంతకుమించి వివరాలు చెప్పలేమని అన్నారు.
ఈ ఘోస్ట్ డ్రోన్లను ఏవెక్స్ ఏరోస్పేస్ సంస్థ తయారుచేస్తోంది. అయితే, అమెరికా ఇప్పటివరకు ఈ సీక్రెట్ డ్రోన్లను ఏ యుద్ధ రంగంలోనూ వినియోగించలేదు. వీటి పరిధి, సామర్థ్యం ఏంటన్నది ఎక్కడా బయటికి పొక్కడంలేదు. ఏదేమైనా వీటితో రష్యా సేనలను ఉక్రెయిన్ దళాలు దీటుగా ఎదుర్కొంటాయని అమెరికా విశ్వసిస్తోంది.
.