Rains: ఈ నెల 25 వరకు తెలంగాణలో వర్షాలు
- కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి
- ద్రోణి ప్రభావంతో వర్షాలు
- పలుచోట్ల ఈదురు గాలులతో వానలు
- హైదరాబాద్ లోనూ చల్లబడిన వాతావరణం
మండు వేసవిలో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలు గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు ఈ నెల 25 వరకు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దాని ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత వారం రోజులుగా హైదరాబాద్ నగరం కూడా చల్లబడింది. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో భానుడి భగభగల నుంచి నగరజీవి సేదదీరుతున్నాడు. ఇటీవలి వరకు తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఆదిలాబాద్ లోని జైనథ్ వద్ద 45 డిగ్రీల సెల్సియస్ తీవ్రతతో ఉష్ణోగ్రత నమోదైంది.