Cash for Ration: రేషన్ బియ్యానికి నగదు బదిలీ కార్యక్రమం వాయిదా పడటానికి కారణం ఇదే: ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Karumuri Nageswar Rao response on stopping of Cash for ration scheme

  • యాప్ లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే పథకాన్ని నిలిపివేశాం
  • నగదు బదిలీపై తదుపరి నిర్ణయం తీసుకున్న తర్వాత తెలియజేస్తాం
  • ప్రజలకు పోర్టిఫైడ్ బియ్యాన్ని ఇస్తున్నాం

ఏపీలో రేషన్ కార్డుదారులకు బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. బియ్యం తీసుకోవాలా? లేక డబ్బులు తీసుకోవాలా? అనేది లబ్ధిదారుల ఇష్టమని ప్రభుత్వం తెలిపింది. అయితే, నగదు బదిలీ పథకం ప్రస్తుతానికి వాయిదా పడింది. 

దీనిపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ పథకాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలిపారు. యాప్ లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే నగదు బదిలీని నిలిపివేశామని చెప్పారు. నగదు బదిలీపై తదుపరి నిర్ణయం తీసుకున్న తర్వాత తెలియజేస్తామని అన్నారు. 

ప్రజలకు పోషకాలను అందించడం కోసం పోర్టిఫైడ్ బియ్యాన్ని ఇస్తున్నామని కారుమూరి తెలిపారు. పోర్టిఫైడ్ బియ్యాన్ని నీటిలో కడిగినప్పుడు పైకి తేలుతాయని... దీన్ని ప్లాస్టిక్ బియ్యంగా భావించవద్దని చెప్పారు. ప్రజలకు ఇచ్చే బియ్యం నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదని అన్నారు. 

రైతుల కళ్లాల వద్దకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులకు దగ్గరగా ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఆలస్యం లేకుండా రైతులకు సకాలంలో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆధార్ తో అనుసంధానమైన అకౌంట్లలో ధాన్యం డబ్బు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రైతులందరికీ ధాన్యానికి సంబంధించిన డబ్బులు వేశామని... ఎక్కడా పెండింగ్ లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News