Nirmala Sitharaman: మిత్ర దేశం బలహీనంగా ఉండాలని అమెరికా కోరుకోకూడదు: నిర్మలా సీతారామన్
- మిత్రుడు ఎప్పుడూ బలహీనంగా ఉండకూడదన్న కేంద్ర మంత్రి
- భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవాలని వ్యాఖ్య
- అమెరికాకు సీతారామన్ పరోక్ష సంకేతాలు
రష్యా - భారత్ వాణిజ్య మైత్రి పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అమెరికాకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి సందేశం ఇచ్చారు. భారత్ కు తన పొరుగు దేశంతో రక్షణ పరమైన సవాళ్లు ఉన్న దృష్ట్యా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి ఊహించిందేనన్నారు.
‘‘అమెరికా దీన్ని అర్థం చేసుకోవాలి. అమెరికాకు భారత్ మిత్రదేశం. కానీ ఆ స్నేహితుడు బలహీనంగా ఉండకూడదు. బలహీన పడకూడదు’’ అని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా భారత్ ను బలహీనపరిచే చర్యలకు దూరంగా ఉండాలన్న పరోక్ష సంకేతం పంపించారు.
నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగొచ్చారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా వైఖరిని అర్థం చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘భారత్ ఎప్పుడూ స్నేహంగానే ఉండాలని అనుకుంటుంది. అమెరికా కూడా స్నేహితుడు కావాలని అనుకుంటే.. ఆ ఫ్రెండ్ బలహీన పడకూడదు. భౌగోళికంగా మేము ఉన్న చోట బలంగా నిలదొక్కుకోవాలి’’అని మంత్రి పేర్కొన్నారు.
భారత్ ఎదుర్కొంటున్న సరిహద్దు భద్రతా సవాళ్లను మంత్రి గుర్తు చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ఉత్తర సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు తలెత్తడాన్ని ప్రస్తావించారు. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను గుర్తు చేశారు.