vasi reddy padma: చంద్రబాబు వేలు చూపించి.. కళ్లుపెద్దవి చేసి నన్ను బెదిరించారు: వాసిరెడ్డి పద్మ
- తాము సమన్లు ఇవ్వకపోతే రేపు ప్రతి మగవాడికీ కొమ్ములు వస్తాయన్న పద్మ
- మహిళా కమిషన్‌ను చులకన భావంతో చూస్తారని వ్యాఖ్య
- మహిళా కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్లు తమముందు హాజరు కావాల్సిందేనని స్పష్టీకరణ
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఒకేసారి వెళ్లడంతో అక్కడ గొడవ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై వాసిరెడ్డి పద్మ ఈ రోజు అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించి, టీడీపీ నేతలపై మండిపడ్డారు.
తాము ఇప్పటికే చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావుకు సమన్లు జారీ చేసినట్లు గుర్తు చేశారు. అందుకు కారణాలు చెప్పాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని అన్నారు. ఏపీలోని మహిళల కన్నీళ్లు తుడవడానికే తమ కమిషన్ ఉందని వ్యాఖ్యానించారు. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె అన్నారు. 24 గంటల్లో బాధ్యులను అరెస్టు చేసి, వారం రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకుంటారని, అత్యాచార బాధితురాలు వద్ద అలాగేనే ప్రవర్తించేదని ఆమె ప్రశ్నించారు. పరామర్శ అనేది ఎలా చేయాలో తెలియకపోతే ఎలా? అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. అదొక బహిరంగ సభ అనుకుంటున్నారా? అని అన్నారు.
మహిళా కమిషన్ ఓ డమ్మీ అనే చెప్పే యత్నాలు టీడీపీ చేస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్ అంటేనే చంద్రబాబు నాయుడికి గౌరవం లేదని అన్నారు. వందలాది మంది బాధితులకు తాము న్యాయం చేశామని చెప్పారు. వేగవంతంగా దర్యాప్తు జరిగేలా చేస్తున్నామని అన్నారు. సమన్లు ఎందుకు ఇచ్చామన్న విషయంపై తాము చాలా స్పష్టంగా వివరణ ఇచ్చామని తెలిపారు.
ఈ రోజు తాము సమన్లు ఇవ్వకపోతే రేపు ప్రతి మగవాడికీ కొమ్ములు వస్తాయని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలను వేధింపులకు గురిచేసే పురుషుడు కూడా మహిళా కమిషన్‌ను చులకన భావంతో చూస్తాడని ఆమె అన్నారు. సమన్లు పంపితే మహిళా కమిషన్ ముందు విచారణకు రానని చెప్పేస్తాడని ఆమె అన్నారు.
మహిళలకు అన్యాయం జరుగుతున్నా తాము చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు. మహిళా కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్లు తమముందు హాజరు కావాల్సిందేనని అన్నారు. చంద్రబాబు నాయుడికి సమన్లు ఇవ్వడానికి మహిళా కమిషన్‌కు ఏ అధికారం ఉందని టీడీపీ నేతలు అంటున్నారని, అధికారం వుంది కాబట్టే ఇచ్చామని అన్నారు. చంద్రబాబు, బోండా ఉమకు సమన్లు ఇవ్వకపోతే మహిళా కమిషన్ తోకముడుచుకుందంన్న సంకేతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు.
చంద్రబాబు వేలు చూపించి.. కళ్లుపెద్దవి చేసి తనను బెదిరించారని ఆరోపించారు. బోండా ఉమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వాసిరెడ్డి పద‌్మ చెప్పారు. అత్యాచార బాధితురాలి ముందు ఇటువంటి తీరు ప్రదర్శించడం ఏంటని నిలదీశారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నే లెక్కచేయకుండా మాట్లాడితే ఏపీలోని మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళల జోలికి వస్తే ఎవరికైనా సరే సమన్లు తప్పవని సందేశం ఇవ్వడానికే తాను చంద్రబాబు నాయుడికి, బోండా ఉమకు సమన్లు పంపానని స్పష్టం చేశారు.