- ఐపీఎల్ లో చెలరేగి ఆడుతున్న ధోనీ
- టీ20 ప్రపంచకప్ కు ప్రాతినిధ్యం వహించాలన్న ఆర్పీ
- ధోనీ రావాలంటూ ఎక్కువ మంది రిప్లయ్
అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి.. ఐపీఎల్ కు కూడా నేడే రేపో గుడ్ బై చెప్పే పనిలో ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అయినా, తనలో ఇంకా గొప్ప క్రికెటర్ కనుమరుగు కాలేదని ఈ ఐపీఎల్ సీజన్ లో ధోనీ నిరూపిస్తున్నాడు. ఈ సీజన్ లో ధోనీ మొత్తం ఏడు మ్యాచుల్లో 120 పరుగులు చేశాడు. సగటు 60గా ఉంది. గతేడాది 16 మ్యాచుల్లో 114 పరుగుల మైలురాయిని.. ఈ సీజన్ లో ఏడు మ్యాచుల్లోనే దాటేశాడు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ధోనీ ఎలా చెలరేగిపోయాడో క్రికెట్ అభిమానులు అందరూ చూశారు. నాలుగు బంతుల్లో 16 పరుగులు రాబట్టి చివరి బంతికి చెన్నైకి విజయాన్ని తెచ్చాడు. ధోనీ ప్రదర్శన క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరినీ కట్టి పడేసింది. ఈ క్రమంలోనే భారత జట్టు మాజీ పేసర్, ధోనీ సన్నిహితుల్లో ఒకరైన ఆర్పీ సింగ్ భిన్నంగా స్పందించాడు.
ధోనీ విషయంలో తన మనసులోని మాటను ఆయన ట్వీట్ రూపంలో తెలియజేశాడు. ‘‘టీ20 వరల్డ్ కప్ కోసం ఎంఎస్ ధోనీని రిటైర్మెంట్ నుంచి బయటకు రావాలని రిక్వెస్ట్ చేద్దామా?’’ అంటూ ట్వీట్ చేశాడు. ఒక్కసారి రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చి ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు ధోనీ ప్రాతినిధ్యం వహించాలన్నది ఆర్పీ సింగ్ అభిప్రాయంగా ఉంది. దీనికి ఎక్కువ మంది యస్ అంటూ, ధోనీ రావాలంటూ స్పందించడం గమనార్హం. అంటే సింగ్ మాదిరే చాలా మంది ధోనీని అంతర్జాతీయ మ్యాచ్ లలో భారత్ తరఫున ఆడాలని కోరుకుంటున్నారు.