TDP: దమ్ముంటే ఫెయిల్యూర్ సీఎంకు నోటీసులివ్వండి... చంద్రబాబుకు నోటీసులపై అనిత ఫైర్
- వైసీపీ హయాంలో 1,500 అత్యాచారాలు
- మహిళలపై దాడుల్లో ఏపీది ఐదో స్థానం
- మహిళల అక్రమ రవాణాలో ఏపీకి రెండో స్థానమన్న అనిత
విజయవాడ ఆసుపత్రిలో అత్యాచారం ఘటన, దానిపై టీడీపీ, వైసీపీ మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం, ఆ క్రమంలోనే తనను బెదిరించారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపణలు... ఆ వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి నోటీసులు... ఇలా వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీ రాజకీయం వేడెక్కింది.
ఈ క్రమంలో.. చంద్రబాబుకు మహిళా కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన విషయంపై టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రత విషయంలో విఫలమైన సీఎంకు నోటీసులు ఇవ్వాలంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ... "నీకు దమ్ముంటే ఫెయిల్యూర్ సీఎంకు నోటీసులు ఇవ్వు. వైసీపీ ప్రభుత్వంలో 1,500 అత్యాచారాలు జరిగాయి. ఒక్క ఏప్రిల్‌లోనే 12 ఘటనలు జరిగాయి. మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మహిళలపై దాడుల్లో ఏపీ దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.