TPCC: గాంధీ భవన్ ముందు జగ్గారెడ్డి నిరసన... పువ్వాడను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్
- పువ్వాడ మెడికల్ మాఫియాగా మారారన్న జగ్గారెడ్డి
- కులం పేరు చెప్పడానికి సిగ్గు లేదా? అని ప్రశ్న
- ఖమ్మంలో పువ్వాడ తిరగకుండా అడ్డుకుంటానని హెచ్చరిక
- మంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం, పోలీసుల అడ్డగింత
హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ కార్యాలయం గాంధీ భవన్ ముందు శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు భారీ సంఖ్యలో పాలుపంచుకున్న ఈ నిరసనలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా నశించాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ విపక్షాలకు చెందిన నేతలపై పీడీ యాక్ట్లు ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపైనా కేసులు పెడుతున్నారన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ మెడికల్ మాఫియాగా మారారని ఆరోపించారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ తిరగకుండా అడ్డుకుంటామన్నారు.
అసలు కులం పేరు చెప్పడానికి పువ్వాడకు సిగ్గులేదా? అని వ్యాఖ్యానించారు. పువ్వాడ అరాచకాలకు సహకరిస్తున్న పోలీసుల సంగతి చూస్తామని హెచ్చరించారు. పువ్వాడ అజయ్ ఆసుపత్రిని ముట్టడిస్తామని జగ్గారెడ్డి అన్నారు. నిరసనలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.