Gujarat Titans: హోరాహోరీ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జయభేరి... కోల్ కతాకు తీవ్ర నిరాశ

Gujarat Titans beat KKR by eight runs in close encounter

  • ఆరో విజయం సాధించిన గుజరాత్
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
  • 8 పరుగుల తేడాతో కోల్ కతాపై విజయం
  • రస్సెల్ పోరాటం వృథా

ఐపీఎల్ తాజా సీజన్ లో మరో హోరాహోరీ మ్యాచ్ జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ముంబయిలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ కలిగించింది. అయితే, గుజరాత్ టైటాన్స్ కీలక సమయాల్లో వికెట్లు తీసి 8 పరుగుల తేడాతో కోల్ కతాను ఓడించింది. 157 పరుగుల లక్ష్యఛేదనలో కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసి ఓటమిపాలైంది.

కోల్ కతా ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. రస్సెల్ ఊపు చూస్తే మ్యాచ్ ను విజయంతో ముగిస్తాడేమో అనిపించింది. కానీ చివరి ఓవర్లో అల్జారీ జోసెఫ్ వేసిన వేగవంతమైన బంతిని టైమింగ్ చేయలేక బౌండరీ వద్ద ఫెర్గుసన్ కు దొరికిపోయాడు. 

అంతకుముందు కోల్ కతా జట్టులో రింకు సింగ్ 35 పరుగులు చేశాడు. ఓపెనర్లు శామ్ బిల్లింగ్స్ (4), సునీల్ నరైన్ (5) విఫలం కావడం కోల్ కతా మిడిలార్డర్ పై ఒత్తిడి పెంచింది. దానికితోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (12), నితీశ్ రాణా (2) కూడా అవుట్ కావడంతో కోల్ కతా ఇన్నింగ్స్ ఒడిదుడుకులకు గురైంది. 

రస్సెల్ పోరాడినా, ఆఖర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. లోయరార్డర్ లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) ఓ మోస్తరు ప్రయత్నం చేసినా అది నిష్ఫలమే అయింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, యశ్ దయాళ్ 2, రషీద్ ఖాన్ 2, అల్జారీ జోసెఫ్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ టోర్నీలో గుజరాత్ ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో గుజరాత్ జట్టు ఒక్క సన్ రైజర్స్ చేతిలోనే ఓడింది.

  • Loading...

More Telugu News