Marco Jansen: మార్కో జాన్సెన్ సంచలన ఓవర్... వంచిన తల ఎత్తకుండా వెళ్లిపోయిన కోహ్లీ
- బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు
- 8 పరుగులకే 3 వికెట్లు డౌన్
- ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన జాన్సెన్
- కోహ్లీ గోల్డెన్ డక్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ మార్కో జాన్సెన్ తన తొలి ఓవర్లో వికెట్ల పండుగ చేసుకున్నాడు. ఈ సంచలన ఓవర్లో జాన్సెన్ అవుట్ చేసినవాళ్లు హేమాహేమీలు. ఆ ఓవర్లో రెండో బంతికి బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (5)ను ఓ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసిన జాన్సెన్... ఆ తర్వాత బంతికే విరాట్ కోహ్లీని అవుట్ చేసి బెంగళూరు శిబిరాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు.
గుడ్ లెంగ్త్ ఏరియాలో పడిన బంతిని పుష్ చేసే ప్రయత్నంలో కోహ్లీ పాయింట్ లో క్యాచ్ ఇచ్చాడు. గత మ్యాచ్ లోనూ ఇదే తరహాలో అవుటైన కోహ్లీ, ఇప్పుడు కూడా అదే తీరులో అవుట్ కావడంతో జీర్ణించుకోలేకపోయాడు. ఈ సందర్భంగా కోహ్లీ ముఖంలో వేదన స్పష్టంగా కనిపించింది. పెవిలియన్ చేరే వరకు కోహ్లీ వంచిన తల ఎత్తలేదు. ఇటీవల ఫామ్ కోల్పోయిన కోహ్లీ ఈ మ్యాచ్ తోనైనా లయ అందుకుంటాడని భావించిన అభిమానుల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది.
ఇక, సఫారీ యువ పేసర్ మార్కో జాన్సెన్ అదే ఓవర్లో తన మూడో వికెట్ ను కూడా తీశాడు. యువ బ్యాట్స్ మన్ అనుజ్ రావత్ ను ఊరించేలా ఆఫ్ స్టంప్ పై బంతిని వేశాడు. ఆ బంతిని ఆడేందుకు ప్రయత్నించగా, బంతి అనుజ్ బ్యాట్ అంచును ముద్దాడుతూ మార్ క్రమ్ చేతిలో పడింది. దాంతో బెంగళూరు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం బెంగళూరు స్కోరు 7 ఓవర్లలో 4 వికెట్లకు 36 పరుగులు. 12 పరుగులు చేసి గ్లెన్ మ్యాక్స్ వెల్... నటరాజన్ బౌలింగ్ లో అవుట్ కావడంతో బెంగళూరు నాలుగో వికెట్ చేజార్చుకుంది.