Sri Lanka: శ్రీలంకలో కొనసాగుతున్న సంక్షోభం.. రాజీనామా చేసేదే లేదంటున్న ప్రధాని మహింద
- మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ససేమిరా
- శ్రీలంకకు భారత్ రూ. 3,820 కోట్ల రుణ సదుపాయం
- భారత్ నుంచి మరో 100 కోట్ల డాలర్ల సాయాన్ని ఆశిస్తున్న లంక
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడంతో శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశాల నుంచి అవసరమైన సరుకులను దిగుమతి చేసుకోలేకపోతోంది. ఫలితంగా మందులు, ఇంధనం, ఆహారంతోపాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరసనకారులు అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన మహింద రాజపక్స రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కూడా ఆయన తోసిపుచ్చారు. ఒకవేళ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే అది తన నాయకత్వంలోనే జరగాలని అన్నారు. మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్ భారీ సాయం ప్రకటించింది. చమురును దిగుమతి చేసుకునేందుకు దాదాపు రూ. 3,820 కోట్ల రుణ సదుపాయం అందించేందుకు ముందుకొచ్చింది.
శ్రీలంక చెల్లించాల్సిన 150 కోట్ల డాలర్ల దిగుమతి బిల్లును వాయిదా వేసేందుకు భారత్ అంగీకరించింది. అంతేకాదు, ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన 40 కోట్ల డాలర్ల రుణ చెల్లింపు గడువును కూడా పొడిగించింది. కాగా, భారత్ మరో 100 కోట్ల డాలర్ల రుణం ఇస్తుందని శ్రీలంక ఆశిస్తోంది.