Ranga Reddy District: ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయన్న ప్రశ్న.. ఏడో తరగతి విద్యార్థి షాకింగ్ ఆన్సర్
- ఎమ్మెల్యేగా పోటీపడేవాళ్లు బిర్యానీ, చీరలు పంచుతారని సమాధానం
- అవి తీసుకుని పెద్దలు ఓట్లు వేస్తారని రాసిన వైనం
- రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల విద్యార్థి సమాధానం
- ఆ జవాబుకు నాలుగు మార్కులు వేసిన ఉపాధ్యాయుడు
ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయన్న ప్రశ్నకు ఏడో తరగతి విద్యార్థి రాసిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్షల్లో రాసిన సమాధానం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఈ సమాధానం అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయన్న ప్రశ్నకు ఆ విద్యార్థి జవాబు రాస్తూ.. ఎమ్మెల్యే కోసం పోటీపడేటోళ్లు ఇంటింటికి వస్తారని, పెద్దోళ్లకు పైసలు, బిర్యానీ ఇస్తారని రాశాడు. అలాగే, ఆడోళ్లకు చీరలకు కూడా పంచుతారని, అవి తీసుకుని పెద్దోళ్లు ఓట్లు వేస్తారని, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలుస్తారని రాశాడు. విద్యార్థి రాసిన ఈ జవాబుకు ప్రశ్నపత్రం దిద్దిన ఉపాధ్యాయుడు నాలుగు మార్కులు వేయడం గమనార్హం.