Navneet Kaur Rana: ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులకు 14 రోజుల రిమాండ్
- మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం
- సీఎం హనుమాన్ చాలీసా పఠించాలన్న నవనీత్
- లేకుంటే సీఎం నివాసం ఎదుట తామే పఠిస్తామని వెల్లడి
- నవనీత్ ఇంటిని ముట్టడించిన శివసేన కార్యకర్తలు
- పోటాపోటీగా పోలీసు కేసులు
- గతరాత్రి నవనీత్, రవి రాణా అరెస్ట్
హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణాలను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాలపై వారిని ఖార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నవీనీత్ రాణా దంపతులను పోలీసులు నేడు బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో, నవనీత్ రాణా దంపతుల తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 29న బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకుంటే తామే సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్ రాణా, రవి రాణా ప్రకటన చేశారు. దాంతో ఆగ్రహం చెందిన శివసేన కార్యకర్తలు నిన్న ఖార్ లోని నవనీత్ రాణా నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. నవనీత్ దంపతుల ఫిర్యాదు మేరకు శివసేన కార్యకర్తలపై కేసు నమోదైంది.
అటు, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో, సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠించాలన్న తమ కార్యాచరణను నవనీత్ రాణా, రవి రాణా విరమించుకున్నారు.