Palla Rajeswar Reddy: నాకసలు మెడికల్ కాలేజీనే లేదు... దందా ఎందుకు చేస్తాను?: రేవంత్ పై విరుచుకుపడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
- మెడికల్ సీట్లు బ్లాక్ చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి
- గవర్నర్ కు లేఖ
- పల్లా, పువ్వాడపై ఆరోపణలు
- స్పందించిన పల్లా
- దమ్ముంటే విచారణ జరిపించుకో అని సవాల్
తెలంగాణలో మెడికల్ పీజీ సీట్ల దందాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ రాశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్లను బ్లాక్ చేసి కోట్లు గడిస్తున్నారని, ఈ దందాలో మంత్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లకు భాగస్వామ్యం ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారని రేవంత్ తెలిపారు. దీనిపై మంత్రి పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకసలు మెడికల్ కాలేజీనే లేదురా వెధవా... నేనెందుకు మెడికల్ సీట్ల దందా చేస్తాను? అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మెడికల్ సీట్లలో అవకతవకలు జరిగాయని నిరూపించాలని పల్లా సవాల్ విసిరారు. కౌన్సిలింగ్ లో మిగిలిపోయిన సీట్లు ఉంటే మేనేజ్ మెంట్ కోటాకు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు కూడా ఉందని అన్నారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం రెండో దశ కౌన్సిలింగ్ పూర్తి కాగా, మిగిలిన సీట్లలో ఒక్కటి కూడా మేనేజ్ మెంట్ కోటాకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
ఇలాంటి అంశాలపై పర్యవేక్షణకు గతంలో ఎంసీఐ ఉండేదని, ప్రస్తుతం ఎన్ఎంసీ పనిచేస్తోందని, రేవంత్ రెడ్డి ఆ సంస్థకు ఫిర్యాదు చేసుకోవచ్చని హితవు పలికారు. మెడికల్ సీట్ల వ్యవహారంలో ఎన్ఎంసీతో కానీ, లేక ఏదైనా అంతర్జాతీయ ఏజెన్సీతో కానీ ఒకేసారి విచారణ జరిపించుకోవాలని అన్నారు.