Venkaiah Naidu: పార్టీ ఫిరాయింపుల చట్ట సవరణకు సమయం ఆసన్నమైంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- బెంగళూరు క్లబ్ ఏర్పాటై 50 వసంతాలు
- వెంకయ్యనాయుడికి సన్మానం
- పార్టీ ఫిరాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య
బెంగళూరు ప్రెస్ క్లబ్ 50 ఏళ్ల వేడుకలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపుల అంశంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
ప్రస్తుతం ఉన్న పార్టీ ఫిరాయింపుల చట్టం రిటైల్ ఫిరాయింపులను అడ్డుకుంటోందని, అయితే హోల్ సేల్ ఫిరాయింపులపై ప్రభావం చూపలేకపోతోందని అభిప్రాయపడ్డారు. దాంతో, పార్టీ మారాలనుకున్న ప్రజాప్రతినిధులు తమకు తోడుగా పార్టీ మారే వ్యక్తుల కోసం చూస్తున్నారని వివరించారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేపట్టాల్సిన తరుణం వచ్చిందని అన్నారు. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీ మారాలని భావిస్తే, ముందు పదవికి రాజీనామా చేయాలని, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.