Pakistan: మా దేశంపై దండయాత్ర చేయాలనుకుంటే సహించే ప్రసక్తే లేదు: పాకిస్థాన్ కు ఆఫ్ఘన్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు
- ఆప్ఘన్ లోని రెండు ప్రావిన్సుల్లో ఎయిర్ స్ట్రయిక్స్ జరిపిన పాకిస్థాన్
- ఈ దాడుల్లో 30 మంది ఆఫ్ఘన్ల మృతి
- ఈ సారికి క్షమించామన్న తాలిబన్ ప్రభుత్వం
తమ భూభాగంపై ఎయిర్ స్ట్రయిక్స్ చేసిన పాకిస్థాన్ పై ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మండిపడింది. తమ దేశంపై దండయాత్ర చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది. తాలిబన్ ల వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు, ఆప్ఘనిస్థాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మొహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ, యావత్ ప్రపంచంతో పాటు పొరుగుదేశం నుంచి కూడా తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు.
తమ భూభాగంలోని కునార్ పై పాకిస్థాన్ దండయాత్రకు పాల్పడటమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. తమ దేశంపై దండయాత్రను క్షమించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రాధాన్యతల కోసం తాజా దాడులను ఇప్పుడు క్షమించామని... మరోసారి రిపీట్ అయితే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఈ నెల 16న ఖోస్త్, కునార్ ప్రావిన్సుల్లో పాకిస్థాన్ ఎయిర్ స్ట్రయిక్స్ చేసింది. పాకిస్థాన్ మిలిటరీ హెలికాప్టర్లు ఈ దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 36 మంది ఆప్ఘనిస్థాన్ పౌరులు చనిపోయారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉండటం గమనార్హం. ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఎన్నో సార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
మరోవైపు ఎయిర్ స్ట్రయిక్స్ తామే జరిపినట్టు పాకిస్థాన్ ఇంతవరకు ప్రకటించలేదు. ఆప్ఘన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై స్పందించాలంటూ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సమాధానమిస్తూ... రెండూ సోదర దేశాలని చెప్పారు. టెర్రరిజాన్ని రెండు దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు తీవ్ర సమస్యగా భావిస్తున్నారని అన్నారు. రెండు దేశాలు తీవ్రవాదం కారణంగా ఎంతో నష్టపోయాయని చెప్పారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజంను అరికట్టడానికి ఇరు దేశాలు కలసికట్టుగా పోరాడాలని అన్నారు.