Botsa Satyanarayana: ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదు: మంత్రి బొత్స
- అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్నీ పరిష్కరిస్తున్నామన్న బొత్స
- సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య
- శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యతన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో టీచర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున అరెస్టులు, నిరసనలతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... తమ ప్రభత్వం అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్నీ పరిష్కరిస్తోందని చెప్పారు.
సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని బొత్స చెప్పారు. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదని అన్నారు. ఉపాధ్యాయులు తొందరపడి సీఎంవో ముట్టడికి వెళ్లే ప్రయత్నాలు చేస్తుండడం ఏంటని నిలదీశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని బొత్స సత్యనారాయణ చెప్పారు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామని, ఆ కమిటీయే అన్ని అంశాలను పరిశీలిస్తుందని అన్నారు. ఇదే విషయంపై మళ్లీ ఓ సమావేశం కూడా జరగనుందని స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.