Gorantla Butchaiah Chowdary: ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.. తెలియక ఇచ్చామని ఇప్పుడు చెప్పడం హేయమైన చర్య: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు ఎందుకు చేయడం లేదన్న బుచ్చయ్య
- అరాచక ఆటవిక రాజ్యంలాగా ఏపీ తయారు అయిందని విమర్శ
- రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేశాయన్న బుచ్చయ్య
కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్‌లో స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
''రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు ఎందుకు చేయడం లేదు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇప్పుడు తెలియక ఇచ్చాము అని చెప్పడం హేయమైన చర్య. అరాచక ఆటవిక రాజ్యంలాగా తయారు అయింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేశాయి.
పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయులు అడిగితే అరెస్టులు చేస్తున్నారు. యూటీఎఫ్ ఆందోళనలపై ప్రభుత్వ వైఖరి సరికాదు. వారిపై దాడి అనేది ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి'' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.