Revanth Reddy: ప్రశాంత్ కిశోర్ విషయంలో మేం ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగింది; రేవంత్ రెడ్డి
- ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిశోర్ చర్చలు!
- టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే చర్చలు అని చెప్పిన రేవంత్
- తనతో కలిసి పీకే మీడియాతో మాట్లాడతారని స్పష్టీకరణ
- టీఆర్ఎస్ ను ఓడించాలని ఆయనే స్వయంగా పిలుపునిస్తారన్న రేవంత్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత రెండ్రోజులుగా హైదరాబాద్ ప్రగతి భవన్ లో మకాం వేసి సీఎం కేసీఆర్ తదితరులతో చర్చలు జరుపుతున్నారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
టీఆర్ఎస్ తో ఒప్పందం తెగదెంపులు చేసుకోవడానికే ప్రశాంత్ కిశోర్ సీఎం కేసీఆర్ ను కలిశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై టీఆర్ఎస్ కు, ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థకు సంబంధాలు తెగిపోయినట్టేనని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ విషయంలో మేం ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని రేవంత్ స్పష్టం చేశారు.
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని, టీఆర్ఎస్ ను ఓడించాలని ఆయనే స్వయంగా పిలుపునిస్తారని తెలిపారు. తనతో కలిసి ప్రశాంత్ కిశోర్ ప్రెస్ మీట్ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశారు.