- ఈ నెల 29న విడుదలవుతున్న 'ఆచార్య'
- 28న విడుదల కాబోతున్న 'కణ్మని రాంబో ఖతిజా'
- ఏప్రిల్ 29న ఓటీటీలో రాబోతున్న 'మిషన్ ఇంపాజిబుల్'
ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2' చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ వారంలో మరో భారీ చిత్రం 'ఆచార్య' విడుదల కాబోతోంది. ఈ వారంలో థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు:
కణ్మని రాంబో ఖతిజా: విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటించిన తమిళ చిత్రం 'కాతు వాక్కు రెండు కాదల్'. దీన్ని 'కణ్మని రాంబో ఖతిజా' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలను ప్రేమించిన వ్యక్తికి ఎదురైన పరిస్థితులు ఏమిటనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఆచార్య: చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ధర్మస్థలి అనే ప్రాంతంలో దేవాలయాలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదల అయి, ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటించింది. కాజల్ అగర్వాల్ పాత్రను సినిమా నుంచి పూర్తిగా తొలగించారు.
రన్ వే 34: అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతోంది. విమానయాన రంగం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. 2015లో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పైలట్ గా నటించారు.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు:గంగూబాయ్ కథియావాడి: అలియా భట్ ప్రధాన పాత్రను పోషించిన ఈ బాలీవుడ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు వర్షన్ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.
మిషన్ ఇంపాజిబుల్: తాప్సీ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో రాబోతోంది. ఏప్రిల్ 29న నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.