Maharashtra: హనుమాన్ ఛాలీసా మేమూ పఠిస్తాం... దమ్ముంటే మమ్మల్నీ అరెస్ట్ చేయండి: ఉద్ధవ్ థాకరే సర్కారుకు ఫడ్నవీస్ సవాల్
- నవనీత్ కౌర్ దంపతులకు మద్దతుగా బీజేపీ
- అఖిలపక్ష సమావేశానికి రాబోమన్న ఫడ్నవీస్
- హనుమాన్ ఛాలీసా పాక్‌లో పఠిస్తారా? అని ప్రశ్న
ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవి రాణాలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర సర్కారుకు పెద్ద సవాలే ఎదురైంది. నవనీత్ కౌర్ దంపతులకు మద్దతుగా నిలిచిన ఆ రాష్ట్ర విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్... తామంతా హనుమాన్ ఛాలీసా పఠిస్తామని, దమ్ముంటే తమను కూడా అరెస్ట్ చేయాలంటూ మహారాష్ట్ర సర్కారుకు సవాల్ విసిరారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ కాసేపటి క్రితం ప్రకటన చేశారు. 'నవనీత్ కౌర్ దంపతుల మాదిరే తమపైనా విద్రోహ కేసులు పెట్టుకోవచ్చు' అని కూడా ఫడ్నవీస్ సవాల్ చేశారు.
హనుమాన్ జయంతి నాడు సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ ఛాలీసా పఠించాలని డిమాండ్ చేసిన ఎంపీ నవనీత్ కౌర్... సీఎం అందుకు సిద్ధంగా లేకుంటే ఆయన ఇంటి ముందు తామే హనుమాన్ ఛాలీసా పఠిస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన శ్రేణులు నవనీత్ కౌర్ దంపతుల ఇంటిని ముట్టడించే యత్నం చేశాయి.
చివరకు నవనీత్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి విద్రోహ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. బెయిల్ కోసం నవనీత్ దంపతులు దరఖాస్తు చేసుకోగా స్థానిక కోర్టు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నవీనత్ దంపతులు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీకి కూడా ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించిన విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్... నవనీత్ కౌర్ దంపతుల డిమాండ్‌లో తప్పేముందని ప్రశ్నించారు.
అయినా హనుమాన్ ఛాలీసాను మహారాష్ట్రలో కాకుండా పాకిస్థాన్‌లో పఠిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. హనుమాన్ ఛాలీసా పఠిస్తామంటేనే విద్రోహ కేసులు పెడతామంటే... తామంతా కూడా హనుమాన్ ఛాలీసా పఠిస్తాం, దమ్ముంలే తమపైనా విద్రోహ కేసులు పెట్టాలని ఆయన సవాల్ చేశారు.