Niti Aayog: ప్రకృతి సాగుపై నీతి ఆయోగ్ సదస్సు... హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్
- దేశంలో క్రమంగా పెరుగుతున్న ప్రకృతి సాగు
- ప్రకృతి సాగుకు పలు రాష్ట్రాల ప్రోత్సాహకాలు
- ఈ క్రమంలోనే ప్రకృతి సాగుపై నీతి ఆయోగ్ జాతీయ సదస్సు
దేశంలో క్రమంగా పెరుగుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ సోమవారం నాడు జాతీయ స్థాయిలో ఓ సదస్సును నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిన జరిగిన ఈ సదస్సుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు.
ప్రకృతి సాగు ద్వారా ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పెంపొందించే దిశగా ఆర్గానిక్ సాగును మరింతగా పెంచాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నీతి ఆయోగ్ నేతృత్వంలో ప్రకృతి సాగుపై జాతీయ స్థాయి సదస్సు జరగడం గమనార్హం.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం కోసం ఏపీ ఇప్పటికే అద్భుతమైన చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. రాష్ట్రంలో ఇప్పటికే 2.9 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు జరుగుతోందని తెలిపారు.