KCR: అప్పుడు కేసీఆర్ రాకూడదంటూ పీఎంఓ నుంచి స్పష్టమైన మెసేజ్ వచ్చింది.. ఒక సీఎంను ప్రధాని అవమానించారు: కేటీఆర్
- ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- ఆ కార్యక్రమంలో ఎక్కడా కానరాని కేసీఆర్
- అంతకు ముందు మోదీ హైదరాబాదుకు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గైర్హాజరు
- అసలు ఏం జరిగిందో ఇంత వరకు ఎవరూ చెప్పని వైనం
- పీఎంఓనే ప్రొటోకాల్ ను ఉల్లంఘించిందన్న కేటీఆర్
హైదరాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమంలో చినజీయర్ స్వామి ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేతుల మీదుగానే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రధానికి స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. వీడ్కోలు పలకడానికి కూడా పోలేదు. అంతకు ముందు గత నవంబర్ లో హైదరాబాదులోని భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఫెసిలిటీని పరిశీలించేందుకు మోదీ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ కనిపించలేదు. దీంతో రకరకాలు చర్చలు జరిగాయి. కేసీఆర్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ గైర్హాజరు కావడంపై ఇంతవరకు ఎవరూ స్పందించ లేదు. ఎవరికి వారు ఊహించుకోవడం తప్ప... ఈ అంశానికి సంబంధించి క్లారిటీ లేదు.
అసలు ఏం జరిగింది? కేసీఆర్ గైర్హాజరుకు కారణం ఏమిటి? అనే విషయంపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పష్టతను ఇచ్చారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ హైదరాబాదుకు వచ్చిన రెండు సార్లూ పీఎంవో (ప్రధాని కార్యాలయం) నుంచి స్పష్టమైన మెసేజ్ వచ్చిందని... ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదనేది ఆ మెసేజ్ సారాంశమని చెప్పారు. ఇది ముమ్మాటికీ ఒక ముఖ్యమంత్రిని ప్రధాని అవమానించడమేనని అన్నారు. ప్రధాని కార్యాలయం ప్రొటోకాల్ ను ఉల్లంఘించిందని విమర్శించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదనే ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ... గవర్నర్ బీజేపీ నాయకురాలి మాదిరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆమె చదివిన రిపబ్లిక్ డే స్పీచ్ కూడా మంత్రివర్గం ఆమోదించినది కాదని చెప్పారు. ఆమె రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల తమిళిసై యాదాద్రి పర్యటనకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఆమెకు స్వాగతం పలికేందుకు ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, అధికారి కానీ రాని సంగతి తెలిసిందే. దీనిపై గవర్నర్ నేరుగానే విమర్శలు గుప్పించారు.