Prashant Neel: 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మన తెలుగువాడే.. ఆయనది ఏ ఊరో తెలుసా?

KGF director Prashanth Neel is a Telugu person

  • ఇండియన్ సినిమాలో సంచలనంగా మారిన ప్రశాంత్ నీల్
  • ఆయనది అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామం
  • రఘువీరారెడ్డి సోదరుడి కుమారుడే ప్రశాంత్

భారత చిత్ర పరిశ్రమలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సరికొత్త సంచలనంగా మారాడు. యష్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. 'కేజీఎఫ్ 2' ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ. 321 కోట్లను కొల్లగొట్టింది. అంతగా ప్రచారం లేని కన్నడ చిత్రసీమను తన సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ ఒక రేంజ్ కు తీసుకెళ్లాడు. 

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే... ప్రశాంత్ నీల్ అచ్చంగా మన తెలుగువాడే. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. నీలకంఠాపురం అనగానే మనకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి గుర్తుకొస్తారు. ప్రశాంత్ నీల్ ఎవరో కాదు... రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. కొన్నేళ్ల క్రితమే ప్రశాంత్ నీల్ తండ్రి చనిపోయారు. ఆయనను నీలకంఠాపురంలోనే ఖననం చేశారు. అప్పుడప్పుడు నీల్ తన గ్రామానికి కుటుంబంతో కలసి వచ్చి వెళ్తుంటాడు. 'కేజీఎఫ్ 2' విడుదల రోజున కూడా స్వగ్రామానికి వచ్చి తన తండ్రి సమాధిని సందర్శించి వెళ్లాడు. 

ప్రశాంత్ నీల్ అసలు పేరు... ప్రశాంత్ నీలకంఠాపురం. ప్రశాంత్ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే కొనసాగింది. హాయ్ ల్యాండ్ ఏరియాలో వారి కుటుంబం ఉండేది. అక్కడ సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతుండేవి. దీంతో, షూటింగులను ఆయన బాగా గమనించేవాడు. ఈ క్రమంలోనే సినిమాలపై ఆయనకు మక్కువ ఏర్పడింది. 

ఎంబీఏ చదివిన తర్వాత ఫిల్మ్ స్కూల్ లో చేరి, అన్ని విభాగాలపై ప్రశాంత్ అవగాహన పెంచుకున్నాడు. 2014లో తన తొలి సినిమా 'ఉగ్రమ్' ను ఆయన తెరకెక్కించాడు. ఏ మాత్రం అంచనాలు లేని ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

  • Loading...

More Telugu News