Abhishek Bachchan: బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప సక్సెస్ లపై అభిషేక్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు!
- ‘పాన్ ఇండియా’ కాన్సెప్ట్ నే తాను నమ్మనన్న అభిషేక్
- ఆ వర్గీకరణ అసలు మంచిది కాదని వ్యాఖ్య
- అంతా భారత సినీ పరిశ్రమలో భాగమేనని కామెంట్
- బాలీవుడ్ లో కంటెంట్ లేదనడం సరికాదన్న అభిషేక్
- హిందీ సినిమాలూ దక్షిణాదిలో హిట్ అయ్యాయని వెల్లడి
ఇటీవలి కాలంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా రిలీజై సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీంతో పాన్ ఇండియా అనే పదం మార్మోగిపోతోంది. అంతేకాదు.. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప వంటి సౌత్ సినిమాల తాకిడికి బాలీవుడ్ తట్టుకోలేకపోతోందని, అసలు బాలీవుడ్ కు కంటెంట్ అంటూ లేనే లేదని విమర్శలు ఎక్కువైపోతున్నాయి.
దీనిపై అమితాబ్ బచ్చన్ తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ స్పందించాడు. అలాంటి వాటిని తాను నమ్మనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాన్ ఇండియా అన్న పదమే తప్పన్నాడు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లో విడుదల కావడం మంచి పరిణామమని వ్యాఖ్యానించాడు. అయితే, పాన్ ఇండియా అనే వర్గీకరణ మాత్రం మంచిది కాదని, తాను దానిని నమ్మనని చెప్పాడు. అసలు పాన్ ఇండియా అంటే ఏంటంటూ ప్రశ్నించాడు.
‘‘మరేదైనా ఇండస్ట్రీకి ఆ పదాన్ని వాడుతున్నామా? లేదే. మన దగ్గర సినీ అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నారు. మన వాళ్లకు సినిమా అంటే పిచ్చి. కాబట్టి సినిమాకు భాషతో పనిలేదు. ఏ భాషైనా అంతిమంగా సినిమానే’’ అని అన్నాడు. వివిధ భాషల్లో పనిచేసినా.. అందరం భారత సినీ పరిశ్రమలో భాగమేనని పేర్కొన్నాడు.
సినిమా బాగుంటే ఎక్కడైనా నడుస్తుందని, చెత్తగా ఉంటే ఫ్లాప్ అవుతుందని అన్నాడు. అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ మంచి కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయని పేర్కొన్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ లేదనడం సరికాదని వ్యాఖ్యానించాడు. దురదృష్టం కొద్దీ గంగుభాయ్ కథియావాడీ, సూర్యవంశీ సినిమాలను అసలు ప్రస్తావించడం లేదని అన్నాడు. ఏదైనా అంతిమంగా ప్రేక్షకులను సినిమాతో అలరించామా? లేదా? అన్నదే ముఖ్యమని తెలిపాడు.
హిందీ సినిమాలు దక్షిణాదిన రీమేక్ చేయకపోవడం వల్లే బాలీవుడ్ లో కంటెంట్ లేదని అంటున్నారా? అని అభిషేక్ అన్నాడు. ఏ భాషలోని సినిమానైనా వేరే భాషలోకి రీమేక్ చేసుకోవచ్చని, అది ఎప్పుడూ జరిగేదేనని చెప్పుకొచ్చాడు. సినిమా రీమేక్ అన్నది కేవలం చాయిస్ అని అన్నాడు.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని, హిందీ సినిమాలూ దక్షిణాదిలో మంచి విజయాన్ని నమోదు చేశాయని గుర్తు చేశాడు. ఏదిఏమైనా అందరం ఓ పెద్ద కుటుంబానికి చెందిన వాళ్లమని వ్యాఖ్యానించాడు. అయితే, మంచి సినిమాలు వచ్చి థియేటర్లు నిండుతున్నందుకు సంతోషంగా ఉందని, ఇది సినీ పరిశ్రమకు మంచి కాలమని అభిషేక్ చెప్పుకొచ్చాడు.